సొంత పార్టీలోనే తనపై కుట్ర జరుగుతోందని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగాధర నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ఒకరు తనపై అవినీతి ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను నిరూపించాలని నారాయణ స్వామి సవాల్ విసిరారు. ''ఆరోపణలు రుజువైతే ఆయన పాదాలను తాకి క్షమాపణలు చెబుతాను'' అని నారాయణ స్వామి అన్నారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న విషయాన్ని మరిచిపోవద్దని, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
తనను అవమానిస్తున్న విషయం సీఎం దృష్టికి వెళ్తే.. ఆ మహానుభావుడి పరిస్థితి ఏం అవుతుందో అర్థం చేసుకోవాలన్నారు. తాను మంచిగా ఉండేందుకు కార్యకర్తలను మోసం చేసే వారు పార్టీని వీడడం మంచిదన్నారు. ఆయనకు తానేదో అన్యాయం చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ మహానుభావుడే గతంలో నేను ఎస్సీగా పుట్టి ఉంటే బాగుండేదని, తనకూ ఓ పదవి దక్కేదంటూ వ్యాఖ్యలు చేసి చులకన అయ్యారని తెలిపారు. అలాంటి వ్యక్తిని నమ్ముకుని కార్యకర్తలు మోసపోకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
తాను పార్టీకి, జగన్‌మోహన్‌రెడ్డికి వీధేయుడిగా పనిచేస్తున్నానని, అయితే తనపై లేనిపోని ఆరోపణలు చేసిన పార్టీ సీనియర్ నాయకుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని స్వామి అన్నారు. ఈ ఆరోపణలు సీఎం దృష్టికి వస్తే సీనియర్ నేతపై చెడు అభిప్రాయం ఏర్పడుతుందని నారాయణ స్వామి అన్నారు. ఆ సీనియర్ నాయకుడు తన పని తీరు మార్చుకోవాలని, లేకుంటే పార్టీని వీడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఆ వ్యక్తి పేరును డిప్యూటీ సీఎం వెల్లడించకపోవడం గమనార్హం.