వాలంటీర్ల‌కు సీఎం జ‌గ‌న్ లేఖ‌.. ఇది ఉద్యోగం కాదు.. సేవ‌

AP CM YS Jagan write letter to volunteers.ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. వాలంటీర్ల‌కు లేఖ రాశారు. ఆ లేఖ‌లో వారి సేవ‌ల‌ను కొనియాడారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2021 5:01 AM GMT
AP CM YS Jagan writes a letter to volunteers

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. వాలంటీర్ల‌కు లేఖ రాశారు. ఆ లేఖ‌లో వారి సేవ‌ల‌ను కొనియాడారు. జీతాల కోసం వాలంటీర్లు చేస్తున్న ఆందోళ‌న ప‌ట్ల స్పందించారు. వాలంటీర్ అనే ప‌దానికి అర్థం స్వ‌చ్చందంగా సేవ‌లు అందించ‌డం అని.. ఇది ఉద్యోగం కాద‌న్నారు. వాలంటీర్లుగా సేవ‌లందిస్తున్న చెల్లెమ్మ‌లూ, త‌మ్ముళ్లూ ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు. కులం, మ‌తం, ప్రాంతం, రాజ‌కీయాలు చూడ‌కుండా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను నేరుగా అందించే సంక‌ల్పంతోనే వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌న్నారు.

జీతాలు పెంచాలని కొంత మంది వాలంటీర్లు రోడ్డు ఎక్కిన విషయం త‌న‌ దృష్టికి వచ్చిందని లేఖ‌లో పేర్కొన్న సీఎం.. వాస్తవాలు తెలియకుండా రోడ్డెక్కిన విషయం త‌న‌ను బాధించింద‌న్నారు. రాష్ట్రంలో రెండున్న‌ర ల‌క్ష‌ల మంది వాలంటీర్లు సేవాభావంతో ప‌నిచేస్తున్నార‌న్నారు. వారు సేవ‌లు ప్రారంభించిన స‌మ‌యంలోనే తాను స్ప‌ష్టంగా చెప్పాన‌ని.. వారికిచ్చిన హ్యాండ్‌బుక్‌లోనూ ఆ విష‌యాన్ని నిర్వ‌చించామ‌ని సీఎం తెలిపారు.

'ప్రతి గ్రామంలో, వార్డులో 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవా ధృక్పథం ఉన్న యువతీ యువకులను నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో గ్రామ వలంటీర్, వార్డు వలంటీర్‌గా నియమిస్తాం. వారు గ్రామ/ వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, నవరత్నాల ద్వారా అందించే పథకాలు లాంటివి ఇంటివద్దకే డోర్‌ డెలివరీ చేస్తారు. వీరికి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో అన్ని పథకాలూ ఇంటి వద్దకే అందేలా డోర్‌ డెలివరీ చేస్తారు'' అని స్పష్టంగా చెప్పడం జరిగింద‌న్నారు.

'వాలంటీర్లుగా సేవలందిస్తున్న వారు ఒక్క విషయాన్ని గమనించండి. గ్రామ, వార్డు సచివాలయంలో మీరు కేవలం వారానికి మూడు రోజులు అది కూడా మీకు వీలున్న సమయంలో మేం అందుబాటులో ఉన్నాం అని సూచిస్తూ అటెండెన్స్‌ ఇస్తున్నారు. మీరు రోజుకు ఇన్ని గంటలు, వారానికి ఇన్ని రోజులు పని చేయాలన్న నిబంధనలు ఏమీ లేవు. పని ఉన్నప్పుడు మాత్రమే సేవాభావంతో ముందుకు వచ్చి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లేందుకు నెలలో పని ఉన్న కొద్ది రోజులు మీ సేవలు అందిస్తున్నారు. పేదవారి ఆశీస్సులు అందుకుంటూ సంతోషంగా మీరు చేస్తున్న కార్యక్రమం ఇది.

మీరు వాలంటీర్లుగా కాకుండా, ఇదే ప‌ని జీతాలు తీసుకుని చేస్తుంటే పేద ప్ర‌జ‌ల్లో ఒక్క‌రైనా మీకు ఇలాంటి గౌర‌వం ఇస్తారా..? వాలంటీర్ పేరుతో మీరు చేసేది స్వ‌చ్చంద సేవ అవుతుందా..? గొప్పగా సేవ‌లందిస్తున్న వాలంటీర్ల‌కు స‌మాజం న‌మ‌స్క‌రిస్తుంద‌ని.. అత్యుత్త‌మ సేవ‌లు అందించిన వారికి నియోజ‌క‌వ‌ర్గం ప్రాతిప‌దిక‌గా ఏటా ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్న‌తాధికారుల స‌మ‌క్షంలో శాలువా క‌ప్పి మిమ్మ‌ల్ని గౌర‌విస్తార‌న్నారు. మీకు వస్తున్న మంచి పేరును తుడిచేసేందుకు, మొత్తంగా వలంటీర్‌ వ్యవస్థను లేకుండా చేయాలన్న దుర్బుద్ధితో ఎవరు కుట్రలూ కుతంత్రాలు పన్నుతున్నారో మీకు తెలుసు. ఇలా ప్రలోభాలకు గురిచేసే వారికి, రెచ్చగొట్టేవారికి దూరంగా ఉంటూ మీ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మీ శ్రేయోభిలాషిగా, మీ అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా. 'అని జ‌గ‌న్ ఆ లేఖ‌లో పేర్కొన్నారు.




Next Story