ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో సీఎం కుడి కాలు బెణికింది. కాలు బెణుకుతోనే ఆయన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తాజాగా నొప్పి మరింత పెరగడంతో శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయానికి సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్‌తో పాటు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. సుమారు 2 గంటల పాటు జగన్ ఆస్పత్రిలోనే ఉన్నారు. పరీక్షల అనంతరం సీఎం.. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో మధ్యాహ్నాం మూడు గంటల తరువాత ఉన్న సీఎం జగన్‌కు ఉన్న అపాయింట్‌మెంట్లన్నీ ఉన్నతాధికారులు రద్దు చేశారు. వాస్తవానికి ఈరోజు సీఎం విద్యారంగంపై సమీక్ష చేయాల్సి ఉంది. కానీ మణిపాల్ ఆస్పత్రికి వెళ్లడంతో పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. అయితే మణిపాల్ ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు జగన్ కాలు బెణుకు అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి కొన్ని సూచనలు చేశారు.