పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు ప్రారంభించిన సీఎం
AP CM YS Jagan Mohan Reddy Pays Tributes to Pingali Venkayya
By అంజి
భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించి దేశం గర్వించేలా చేశారని వైఎస్ జగన్ అన్నారు. జెండాను గౌరవించే దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత మచిలీపట్నం పట్టణానికి సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. ఆయన రైతు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త, మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకుడు, జపనీస్ భాషలో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయనను 'జపాన్ వెంకయ్య' అని కూడా పిలిచేవారు.
ఆగస్టు 2న వెంకయ్య జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయనుంది. న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్టాంపును విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పింగళి కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారిని సన్మానించనున్నారు.
పింగళి వెంకయ్య స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జరిగే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, నగరిలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నారు.
దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. pic.twitter.com/tcYgSK5Ep3
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2022