విజయనగరం జిల్లా కురుపాంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు. ఈ ఘటనలో విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా విద్యార్థులు పాముకాటుకు గురైన ఘటన గురించి సీఎం వైఎస్ జగన్‌కు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రి వేణుగోపాల కృష్ణా తెలియజేశారు. ఒక విద్యార్థి మృతి చెందాడని, మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్.. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. విద్యార్థి కుటుంబానికి మంత్రుల ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తెలిపారు.
ఈ ఆర్థిక సాయంతో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి కాస్తా ఊరట లభిస్తుంది. గురువారం నాడు మహాత్మగాంధీ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో పాము కాటుతో విద్యార్థి రంజిత్ మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి భోజనం చేసిన విద్యార్థులు నిద్రించే గదిలో పాము ప్రవేశించింది. విద్యార్థులు మంతిని రంజిత్, వంగపండు నవీన్, ఈదుబిల్లి వంశీలను పాము కాటు వేసింది. వారిని ప్రాథమికి చికిత్స కోసం మొదట పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు.