వైజాగ్ షిఫ్ట్ ప్లాన్ వాయిదా వేసిన జగన్?

ఏపీ సీఎం జగన్ తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, నివాసాన్ని తాడేపల్లి నుంచి విశాఖకు మార్చాలనే ఆలోచనను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

By అంజి  Published on  4 Aug 2023 6:30 AM GMT
AP CM YS Jagan, Vizag shifting plan, APnews

వైజాగ్ షిఫ్ట్ ప్లాన్ వాయిదా వేసిన జగన్?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, నివాసాన్ని తాడేపల్లి నుంచి విశాఖపట్నంకు మార్చాలనే ఆలోచనను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మార్చిలో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో.. నగరం రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోందని, తానే స్వయంగా విశాఖకు షిప్ట్‌ అవుతానని చెప్పారు. అయితే సీఎం జగన్ నిర్దిష్ట తేదీని ప్రస్తావించనప్పటికీ, విద్యా సంవత్సరం ప్రారంభంతో వచ్చే జూలైలో ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళ్లవచ్చని వైఎస్సార్‌సీపీ నేతలు చెప్పారు. కానీ అది జరగలేదు.

తరువాత న్యాయపరమైన అడ్డంకులు తొలగించి జగన్ సెప్టెంబర్‌లో విశాఖపట్నంకు మారుతున్నట్లు ఉత్తర ఆంధ్ర పార్టీ ఇంచార్జ్‌, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సీఎంవో మాత్రమే కాదు, సెప్టెంబరు నాటికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా విశాఖకు తరలిస్తామని సుబ్బారెడ్డి ఇటీవల ప్రకటించారు. భీమిలి రోడ్డులోని ఇతర ప్రైవేట్ భవనాలతో పాటు పోర్టు సిటీలో అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని పరిపాలనా భవనాలుగా వినియోగిస్తామన్నారు. త్వరలో కసరత్తు ప్రారంభం కానుందని, సెప్టెంబర్‌లోగా అమరావతి నుంచి విశాఖకు పరిపాలనను మార్చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సుబ్బారెడ్డి తెలిపారు.

అందుకు తగ్గట్టుగానే శ్రావణమాసంలో వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త వ్యాపారాలకు, గృహప్రవేశాలకు అనుకూలమైన జగన్ పోర్టు సిటీకి వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. దసరా నాటికి జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటారని అనకాపల్లికి చెందిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన రాజధాని తరలింపు దసరా పండుగ నాటికి పూర్తవుతుందని అమర్‌నాథ్ అన్నారు. దసరా నాటికి రాష్ట్ర పరిపాలనలో ముఖ్యమైన మార్పులు రానున్నాయని, ఇది అన్ని పార్టీల నాయకులు, క్యాడర్‌తో పాటు ప్రజలను కూడా సంతోషపరుస్తుందని ఆయన అన్నారు. దసరా నాటికి అన్నీ క్లియర్ అవుతాయి అని అన్నారు.

Next Story