ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న జ‌గ‌న్‌కు అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. అనంత‌రం స్వామివారికి సీఎం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. స్వామివారి దర్శనానంతరం కొత్తగా తయారు చేసిన రథాన్ని జగన్ ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు. ఈనెల 28 వరకు స్వామివారి కల్యాణోత్సవాలు జరుగనున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్ 5న రథం దగ్దమైన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని దుండగులు రథాన్ని తగలబెట్టారు. ఈ నేపథ్యంలో రూ. 95 లక్షల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని తయారు చేయించింది. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రథాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story