నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
AP CM Jagan released job calendar.నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు.
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2021 2:58 PM ISTనిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు భర్తీ చేస్తారనే వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దళారులు, సిపార్సులు, పైరవీలకు తావు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయన్నారు. గ్రూప్1, గ్రూప్2తో సహా అన్ని ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించే మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎంల సహకారంతో కొత్త విధానాన్ని రూపొందించనున్నారు.
ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ను తీసుకొచ్చాం. రెండేళ్లలో ఏకంగా 6,03,756 ఉద్యోగాలను భర్తీ చేశాం. వీటిలో1,84,264 శాశ్వత ప్రాతిపదికన, 3,99,791 పొరుగుసేవలు, 19,701 ఒప్పంద ఉద్యోగాలు ఇచ్చాం. రూ.3500 కోట్ల భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం. 51,387 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఇచ్చాం. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం. ప్యాకేజీ, ఓటుకు కోట్లు కేసు కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. గత ప్రభుత్వం మాటలతో భ్రమ కల్పించిన విషయం అందరికీ తెలుసు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంక్షేమం, అభివృద్ధి ఆగలేదు. ప్రభుత్వ ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి. రైతులకు అండగా గ్రామాల్లో ఆర్బీకేలు నిలిచాయి. అని జగన్ అన్నారు.