సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
AP CM Jagan Delhi tour postponed.ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2021 6:56 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీలో పెద్దలను కలిసి వ్యాక్సినేషన్ గురించి చర్చించేందుకు ప్లాన్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతోనే పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో అపాయింట్మెంట్ కుదిరితే గురువారం తర్వాత ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు, కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రానికి అందాల్సిన సహాయం గురించి చర్చించనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఆదివారం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. 83,690 శాంపిళ్లను పరీక్షించగా.. 8,976 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,58,339కి చేరింది. నిన్న 13,568 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,23,447కి పెరిగింది. కోవిడ్ వల్ల చిత్తూర్ లో పన్నెండు మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది, అనంతపురంలో ఎనిమిది, గుంటూరులో ఎనిమిది, శ్రీకాకుళంలో ఎనిమిది, విజయనగరంలో ఎనిమిది, ప్రకాశంలో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, కర్నూలో ఆరుగురు, నెల్లూరులో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, కడపలో ఇద్దరు చొప్పున మొత్తం 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,466కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,23,426 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,97,91,721 సాంపిల్స్ ని పరీక్షించారు.