ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో ముఖ్య భూమిక పోషించి.. అన్ని వ్యవహారాలూ చక్కబెట్టిన మాజీ మంత్రి నారాయణ గురించి తెలియని వారు ఉండరు. విద్యా సంస్థ‌ల అధిప‌తి అయిన‌ ఆయనకు రాజకీయాల్లో అస్సలేమాత్రం అనుభవం లేదు. అయినా నారాయణకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి, కీలకమైన మంత్రి పదవి ఇచ్చేశారు చంద్రబాబు. అప్పట్లో మంత్రి నారాయణ మీడియా ముందు కనబడని రోజు లేదు అమరావతికి సంబంధించి. ఎప్పుడైతే టీడీపీ అధికారం కోల్పోయిందో, ఆ తర్వాత నారాయణ పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు.


ఒకదశలో అసలు ఆయన పార్టీలో కొనసాగుతున్నారా? లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. తాజాగా టిడిపి సీనియర్‌నేత, మాజీ మంత్రి పి.నారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని నారాయణ నివాసానికి చేరుకున్న‌ సీఐడీ అధికారులు ఇవాళ నోటీసులు ఇచ్చారు

నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. ఈనెల 22న విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈనెల 23న విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమరావతి కుంభకోణానికి సంబంధించి తాజాగా సీఐడీ జారీ చేసిన నోటీసుల్లో చంద్రబాబు పేరు తొలుత వుంటే, రెండో పేరు నారాయణదే కావడం గమనార్హం.


సామ్రాట్

Next Story