'అయ్యన్న, ఆయన కుమారులపై వచ్చిన ఆరోపణలు నిజమే'
AP CID DIG explanation on TDP leader Ayyannapatrudu arrest. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ అధికారులు
By అంజి Published on 3 Nov 2022 10:14 AM GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐడీ డీఐజీ సునీల్ నాయక్.. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్‌లను ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై వివరణ ఇచ్చారు. అయ్యన్న, రాజేష్‌లను చట్ట ప్రకారం అదుపులోకి తీసుకున్నట్లు డీఐజీ తెలిపారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్ విషయంలో అన్ని నిబంధనలు పాటించామని, మెడికల్ టెస్ట్‌ల తర్వాత కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు.
అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్‌లు.. తమది కానీ 2 సెంట్ల భూమికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తయారు చేశారని డీఐజీ తేల్చి చెప్పారు.అంతటితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారి చేత అటెస్టేషన్ కూడా చేయించారని తెలిపారు. ఇందుకోసం సదరు ఏఈని అయ్యన్న తన ఇంటికి పిలిపించి బలవంతంగా అటెస్టేషన్ చేయించారని తెలిపారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందడంతో అయ్యన్న, ఆయన కుమారులపై కేసు నమోదు చేశామన్నారు. అయ్యన్నపై వచ్చిన అభియోగాలు వాస్తవమేనని ఏపీ సీఐడీ డీఐజీ తెలిపారు.
ప్రస్తుతం వారు ఆక్రమించిన 2 సెంట్ల భూమిని చింతకాయల విజయ్‌కి రిజిస్ట్రేషన్ చేశారు. విచారణ చేసిన ఇన్‌స్పెక్టర్ తమకు నివేదిక ఇచ్చారని ఆయన వివరించారు. ఈ రిపోర్టు ప్రకారం.. అయ్యన్న, అతని కుమారులపై ఐపీసీ సెక్షన్లు 464, 467, 471, 474, రెడ్ విత్ 120బీ కింద కేసులు నమోదు చేశారు. అయ్యన్నను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు డీఐజీ బదులిచ్చారు. ఎవరినైనా అరెస్టు చేస్తున్నప్పుడు వారు తమ మాటలను పాటించడానికి నిరాకరిస్తే, వారిని హింసాత్మకంగా అరెస్టు చేసే అధికారం తమకు ఉందని ఏపీ సీఐడీ డీఐజీ తెలిపారు. "మేము ఈ విషయంలో చట్టానికి లోబడి పనిచేశాము. ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు" అని చెప్పారు.