ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ పదవీకాలాన్ని 6 నెలల పాటు జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం నాడు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 16న ఆయన సర్వీసు పొడిగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్, ఆల్ ఇండియా సర్వీసెస్ (డెత్-కమ్-రిటైర్మెంట్ బెనిఫిట్స్) రూల్స్, 1958లోని రూల్ 16 (1) ప్రకారం.. నీరభ్ కుమార్ సేవలను ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఒక ఆర్డర్‌లో పేర్కొన్నారు.
1987వ బ్యాచ్ కు చెందిన సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలాన్ని జులై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు పొడిగించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. దీంతో తదుపరి సీఎస్ గా 1987వ బ్యాచ్ కు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరభ్ కుమార్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. సీఎస్ బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.