అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9, 10 షెడ్యూల్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పనుంది. దీనికి సంబంధించి నిన్న అధికారులతో మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది. ఆన్‌లైన్ విధానంలో ఈ చర్చ జరిగింది. వయోపరిమితి పెంపునకు ఉన్న సాధ్యాసాధ్యాలు.. పెంపుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపై చర్చించారు. అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి జూమ్ ద్వారా మంత్రి నారాయణ సమావేశంలో పాల్గొన్నారు.
కోర్టు ఆదేవాలతో ఇప్పటికే కొనసాగుతున్న 62 ఏళ్లు పైబడిన 2,831 మంది ఉద్యోగులపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వయోపరిమితి పెంపుతో పడే అదనపు భారాలపై వివరాలు సేకరించి మరోసారి భేటీ కావాలని ఉపసంఘం నిర్ణయించింది. వీటిపై పూర్తిస్థాయిలో సమగ్ర నివేదికను తయారు చేసిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపునకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ సమావేశంలోమంత్రి పయ్యావుల కేశవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.