రేపే ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు మరో శుభవార్త రెడీ!
రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని భావిస్తోంది.
By అంజి Published on 19 Nov 2024 7:03 AM GMTరేపే ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు మరో శుభవార్త రెడీ!
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం నాడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ వస్తే సర్కారు మరో హామీ నెరవేర్చినట్టు అవుతుంది. అయితే ఉచిత బస్సు పథకం అమలు కోసం ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారులు పూర్తి ప్రణాళికను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి.
ఈ పథకం అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో అధికారుల బృందాలు పర్యటించాయి. రెండు ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను వారు అధ్యయనం చేశారు. ప్రస్తుతానికి ఆర్టీసీ టిక్కెట్ల ద్వారా నెలకు సగటున 500 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. ఇందులో డీజిల్‌పై 220 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆర్టీసీ నెలకు సగటు ఆదాయంలో రూ.125 కోట్లు (25 శాతం) ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఇప్పుడు, ప్రభుత్వం ఈ మొత్తాన్ని వదులుకోవాలి. ఉచిత ప్రయాణ పథకం కోసం ఆర్టీసీకి మరో రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.