పవన్ వ్యాఖ్యలను.. మేం తప్పుగా చూడట్లేదు: పురంధేశ్వరి
పొత్తుల అంశంపై తమ పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు.
By అంజి Published on 17 Sept 2023 12:14 PM ISTపవన్ వ్యాఖ్యలను.. మేం తప్పుగా చూడట్లేదు: పురంధేశ్వరి
ఇటీవల టీడీపీ, జనసేన రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. అయితే, టీడీపీ, జనసేన కలిసిపనిచేస్తాయన్న పవన్.. బీజేపీకూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. తాజాగ ఇదే విషయమై పొత్తుల అంశంపై తమ పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ప్రస్తుతం మేం జనసేనతో పొత్తులో ఉన్నామని తెలిపారు. ఇక టీడీపీతో పొత్తు విషయమై పవన్.. బీజేపీ అగ్ర నేతలతో మాట్లాడతాం అని అన్నారని, అంటే బీజేపీతో పార్టనర్‌గా ఉన్నట్టే కదా అని స్పష్టం చేశారు. పవన్ వ్యాఖ్యలను తాము తప్పుగా చూడట్లేదని పురంధేశ్వరి తెలిపారు.
తమ అధిష్ఠానానికి అన్నీ వివరిస్తామని పవన్ తెలిపారని చెప్పారు. టీడీపీ పొత్తు విషయమై కేంద్ర పెద్దలతో చర్చించాక తమ అభిప్రాయం చెప్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడంపై పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ విధానాన్ని తొలుత తప్పుబట్టింది బీజేపీనేనని అన్నారు. దీంతో చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారానికి కాస్తా చెక్ పెట్టినట్టైంది. సీఐడీ.. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని అన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారని తెలిపారు.
అంతకుముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, విశిష్ఠ అతిధిగా కేంద్రమంత్రి భగవంత్ కుబా హాజరయ్యారు. విశ్వకర్మ జన్మదినం ఇదే రోజు కావడంతో శ్రీ విరాట్ విశ్వకర్మ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ చేతివృత్తి కళాకారులకు సన్మానం నిర్వహించారు.