దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
By Knakam Karthik
దొంగల్లా వచ్చి సంతకాలు చేసి వెళ్లడమేంటి? వైసీపీ సభ్యులపై స్పీకర్ హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ సభ్యులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా, దొంగచాటుగా అసెంబ్లీక వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే హాజరు రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ప్రశ్నలు వేస్తున్నారే తప్ప.. సభకు మాత్రం రావడం లేదని మండిపడ్డారు. సంతకాలు పెట్టిన వాళ్లు తనకు సభలో కనబడాలి కదా.. అంటూ సెటైర్లు వేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సభ్యులు ఇప్పటికైనా సగర్వంగా సభకు రావాలని స్పీకర్ అయన్న పాత్రుడు వారికి సూచించారు.
ఈ సమావేశంలో 25 ప్రశ్నలకు సభలో సమాధానాలు రాలేదు. ప్రతి పక్ష సభ్యులు ప్రశ్నలు వేయడం వల్ల మరో ఇద్దరు సభ్యులు అడగడానికి ఇబ్బంది వస్తోంది. ఇది సమంజసం కాదు ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండటం లేదు. ఇది చాలా దురదృష్టకరం, ఎన్నికలయిన సభ్యులు గౌరవంగా సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా ఆ సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎందుకు ముఖం చాటేయడం. హాజరుపట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదు. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దు అని కోరుతున్నాం..అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.