ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు(గురువారం) ఉదయం ప్రారంభం అయ్యాయి. బద్వేల్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఇటీవల మరణించిన ఎంఎ అజీజ్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి మృతి, మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే టీ.వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ఈ సమావేశాల్లో 14 ఆర్డినెస్ప్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది.
26 వరకు అసెంబ్లీ సమావేశాలు..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు సమావేశాలను కొనసాగించనున్నారు. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఒక్క రోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపించగా.. తాజాగా 26 వరకు కొనసాగనున్నాయి.