ఏపీ రాజకీయాల్లో హీట్.. పవన్ అక్కడి నుంచే పోటీ చేస్తారా?

తాజాగా ఇప్పుడు సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన పార్టీలు దృష్టి పెట్టాయి.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 6:55 AM IST
ap assembly elections, janasena, tdp, pawan kalyan,

ఏపీ రాజకీయాల్లో హీట్.. పవన్ అక్కడి నుంచే పోటీ చేస్తారా? 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై అందరి దృష్టి పడింది. ఎన్నికలకు పెద్దగా సమయం కూడా లేదు. ఇంకొద్ది నెలలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి మరోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ భావిస్తోంది. వైనాట్‌ 175 నినాదంతో ముందుకు వెళ్తుంది. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ విజయానికి బ్రేక్‌ వేయాలని బావిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ముఖ్యనేతలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. అధికార ప్రకటన ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో రెండు చోట్ల నుంచి పోటీ ఓటమిని చూసిన పవన్‌ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన పవన్‌కు ఘోర పరాభవం తప్పలేదు. బీఎస్పీ, వామపక్షాల మద్దతుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పవన్‌కు చేదు ఫలితాలను మిగిల్చాయి. భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో ఓడిపోగా.. గాజువాకలో మూడోస్థానానికి పరిమితం అయ్యారు. దాంతో.. పవన్‌ రాజకీయ భవిష్యత్‌పై ప్రశ్నలు వచ్చాయి. ఇక ఆయన రాజకీయాల్లో ఉండటం సరికాదనే వాదనలూ వినిపించాయి.కానీ.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పూర్తిగా లెక్కలు మార్చారు. ప్రభుత్వాన్ని నిత్యం నిలదీస్తూ.. తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలకు దగ్గరయ్యారు. అంశాల వారీగా ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో తిరిగారు. బీజేపీతో కలిసి ముందుకు సాగారు. ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. వైసీపీ ఓటు చీలవద్దనీ.. అందుకే తాము ఉమ్మడిగా పోటీ చేస్తామని రెండు పార్టీలు ప్రకటించాయి.

గతంలో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో ఈ సారి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సారి రెండు చోట్ల కాకుండా ఒకే చోట పోటీ చేస్తారని సమాచారం అందుతోతంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీలో ఉంటారని ఆ పార్టీ వర్గాలు, అభిమానలు చెబుతున్నారు. ఆ దిశగా జనసేన గ్రౌండ్‌ వర్క్‌ కూడా చేస్తోందని సమాచారం. ఏపీ వ్యాప్తంగా కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పిఠాపురం. 2009లో ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. ఇక్కడే జనసేన అభ్యర్థికి గత ఎన్నికల్లో 28వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కానీ.. వైసీపీ నుంచి పోటీ చేసిన దొరబాబు పిఠాపురంలో గెలిచారు. పలు సర్వేల్లో కూడా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే గెలుపు ఖాయమని తేలిందట. దాంతో.. జనసేన పిఠాపురంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వారాహి యాత్ర విసయంలో కూడా పవన్ పిఠాపురానికి ఎక్కువ సమయం ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తేలాలంటే ఇంకా కొద్ది రోజులు పట్టనుంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు జరిగాక.. ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది.

Next Story