వేతనాలు పెంచాలని 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్.. తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె

సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో 1,20,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మె 9వ రోజుకు చేరుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Dec 2023 10:45 AM IST
APnews, Anganwadi workers, protest, APgovt

వేతనాలు పెంచాలని 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్.. తొమ్మిదో రోజుకు చేరిన సమ్మె

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో 1,20,000 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న రాష్ట్రవ్యాప్త సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 వేల అంగన్‌వాడీ కేంద్రాలు నిలిచిపోయాయి.

అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7వేలు అందజేస్తున్నట్లు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పేర్కొంది. అధికారంలోకి రాకముందు పాదయాత్రలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు రూ.1000 వేతనాలు పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఏమీ చేయలేదు.

వారి డిమాండ్లు ఏమిటి?

1. వారి ప్రధాన డిమాండ్ వర్కర్లు, హెల్పర్లకు జీతం పెంపు.

2. కార్మికులకు నిర్బంధ గ్రాట్యుటీని అందించడానికి సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించండి.

3. అంగన్‌వాడీ కార్యకర్తల మొబైల్ యాప్‌లన్నింటినీ విలీనం చేయాలి.

4. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయాలి.

5. పెన్షన్లు, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలి.

6. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి.

''మేము వారిని చాలాసార్లు చర్చలకు పిలిచాము, కాని వారు స్పందించలేదు. మేము నిరసనలు చేపట్టిన ప్రతిసారీ, వారు మమ్మల్ని అరెస్టు చేయడం ప్రారంభిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచింది. 45 ఏళ్లకే అనారోగ్యం పాలవుతుండగా, 65 ఏళ్ల వరకు ఎలా పని చేయగలం?'' అని విజయవాడ నుంచి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్త ప్రశ్నించారు.

“అంగన్‌వాడీ కేంద్రాలు కేవలం బేబీ సిట్టింగ్, పిల్లలకు ఆహారం ఇవ్వడం కోసం మాత్రమే కాదు. మా ఉద్యోగాలతో పాటు మేం చేసే పనులు చాలా ఎక్కువ. ఉదాహరణకు, మేము ప్రభుత్వ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు, మాకు ప్రయాణ భత్యం (TA) చెల్లించాలి. కానీ 2008 నుంచి మాకు బిల్లులు ఇవ్వడం లేదు.. మా డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసనలు ఆపేది లేదు’’ అని విశాఖపట్నం నుంచి ఓ అంగన్‌వాడీ వర్కర్ నిరసన తెలిపారు.

మూడు యూనియన్ల మద్దతు

ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు అంగన్‌వాడీ కార్యకర్తలకు మద్దతుగా నిలిచారు.

అంగన్‌వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ నిరసనను కొనసాగించాలని సీపీఐ (మావోయిస్ట్) ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ పేర్కొంది. 2.65 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచుతామని వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలన్నింటినీ మరిచిపోయింది' అని సీపీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

తాళాలు పగలగొట్టారు

చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌, టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) వంటి పథకాలు సమ్మె కారణంగా దెబ్బతినగా, సచివాలయ సిబ్బంది తాళాలు పగులగొట్టి ప్రీ స్కూళ్లను తెరిచారు. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేందుకు నిరాకరించారు.

Next Story