Tirumala: బోనులో చిక్కిన మరో చిరుత
తిరుమలలో చిరుతల సంచారంతో గత కొన్ని రోజుల నుంచి భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది.
By అంజి Published on 17 Aug 2023 4:09 AM GMTTirumala: బోనులో చిక్కిన మరో చిరుత
తిరుమలలో చిరుతల సంచారంతో గత కొన్ని రోజుల నుంచి భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక దారిలో లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దగ్గర అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. 50 రోజుల వ్యవధిలో మొత్తం మూడు చిరుతలు బోనులో చిక్కాయని అటవీశాఖ, టీటీడీ అధికారులు తెలిపారు. జూన్ నెలలో ఓ చిరుత, ఈ సోమవారం (ఆగస్టు 14) నాడు మరో చిరుత చిక్కింది.. తాజాగా మరొక దాన్ని పట్టుకున్నారు. ఈ చిరుతను కూడా ఎస్వీ జూ పార్క్‌కు తరలిస్తున్నారు.
ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందింది. ఈ నేపథ్యంలోనే చిరుతను బంధించేందుకు మెట్ల మార్గంలో మూడు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహాస్వామి ఆలయం, 35వ మలుపు దగ్గర బోన్లు ఉంచారు. ఈ క్రమంలోనే మొన్న ఓ చిరుత చిక్కగా, ఇవాళ తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది. ఇదిలా ఉంటే.. మెట్లమార్గంలో భక్తులకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలన్న సూచన అమలు చేయడం కుదరదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరుతల స్వేచ్ఛా సంచారానికి కంచె ఏర్పాటుతో అడ్డంకి సృష్టించినట్టు అవుతుందని వివరించారు.
చిరుతలన్నీ పెద్దవే కావడంతో కంచెను దాటి కూడా అవి దాడి చేయగలవని చెప్పారు. రెండు, మూడు చిరుతలు నడక మార్గంలో సంచరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం.. భక్తుల రక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటోంది. మెట్ల మార్గంలో సిబ్బందిని మోహరించడంతోపాటు, భక్తులకు కర్రలు పంపిణీ చేయడం, చిరుతలను పట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల బోనులో చిక్కిన చిరుత.. ఇవాళ దొరికిన చిరుతల్లో చిన్నారిని చంపేసినది ఏది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. సోమవారం బోనులో పడిన చిరుత ఐదారేళ్ల వయసు ఉంటుందంటున్నారు. ఇవాళ దొరికింది కూడా పెద్దదే అంటున్నారు.