అమరావతి: ఈ ఉదయం ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా దీన్ని ధ్రువీకరించారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం. నిన్న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఎక్కడ తమ వివరాలు బయటపెడతారేమోనని మిగతా నేతలు భయపడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో అనేక మంది ఛత్తీస్‌గఢ్ నుంచి ఏపీకి వచ్చి తలదాచుకుంటున్నారని సమాచారం. అయితే ఎలాంటి భయం లేకుండా లొంగిపోవడానికి రావాలని, తాము రక్షణ కల్పిస్తామని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చెప్పారు. అటు హిడ్మాను పట్టుకుని కాల్చి చంపినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయాడన్నారు.
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!
పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లెటర్ వైరలవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ స్థానిక జర్నలిస్టుకు ఈ లేఖ రాసినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 'జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి' అని లేఖలో ఉన్నట్టు పేర్కొంది.