Tirumala: ఎట్టకేలకు చిక్కిన నాలుగో చిరుత
తిరుమల కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. తిరుమల కాలి నడక మార్గంలో మరో చిరుత బోనులో చిక్కుకుంది.
By అంజి Published on 28 Aug 2023 2:45 AM GMTTirumala: ఎట్టకేలకు చిక్కిన నాలుగో చిరుత
తిరుమల కొండల్లో ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసింది. తిరుమల కాలి నడక మార్గంలో మరో చిరుత బోనులో చిక్కుకుంది. ఏడు రోజులుగా తప్పించుకుంటూ తిరుగుతున్న చిరుత ఎట్టకేలకు ఆదివారం రాత్రి సమయంలో బోనులో చిక్కింది. ఇకపై తిరుమల నడకదారి మార్గంలో భక్తులు ప్రశాంతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. అలిపిరి నడక మార్గంలో కొన్ని రోజుల నుంచి చిరుతల సంచారం భక్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఈ క్రమంలోనే వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టగా.. మూడు చిరుతలు బోనులో పడ్డాయి. ఇక నాలుగో చిరుత బోను దాకా వచ్చి తప్పించుకుంది.
ఇలా వారం రోజులు గడిచింది. తాజాగా ఆదివారం రాత్రి 7వ మైలు దగ్గర ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు నాలుగో చిరుత చిక్కింది. దీంతో ఆపరేషన్ చిరుత ముగిసినట్లేనని అధికారులు అంటున్నారు. చిరుతల పట్టివేత పూర్తి కావడంతో భక్తులు ప్రశాంతంగా నడకమార్గంలో సంచరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జూన్ 22న బాలుడు కౌశిక్‌పై మెట్ల మార్గంలో చిరుత దాడి చేసింది. చివరకు చిరుత 500మీటర్ల దూరంలో బాలుడిని వదిలేసి పారిపోయింది. గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో ప్రాణాపాయం తప్పింది. తిరుమల నడక మార్గంలో చిరుతల సంచరాన్ని అధికారులు పలుమార్లు గుర్తించారు.. కానీ వాటిని పట్టుకునే ప్రయత్నాలు చేయలేదు.
బాలుడిని నోట కరుచుకుని చిరుత వెళ్లడంతో దానిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశారు. జూన్ 24న బోనులో చిక్కిన చిరుతను నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆ తర్వాత నరసింహ స్వామి ఆలయం వద్ద ఆగష్టు 11న నెల్లూరు జిల్లా లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. నడక మార్గంలో తిరుమల వెళుతున్న బాలికను దాడి చేసి చంపేయడంతో భక్తులు హడలెత్తిపోయారు. దీంతో టీటీడీ అప్రమత్తమై పెద్ద ఎత్తున దిద్దుబాటు చర్యలు చేపట్టారు. చిరుతల నుంచి భక్తులను కాపాడాలనే ఉద్దేశంతో వాటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. విజయవంతమయ్యారు.