జగన్‌కు దూరం అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్

సోషల్‌ మీడియాలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై ఇటీవల పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

By అంజి  Published on  18 May 2023 11:15 AM GMT
Anil Kumar Yada, CM Jagan, APnews,YCP, TDP

జగన్‌కు దూరం అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ 

సోషల్‌ మీడియాలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై ఇటీవల పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ కు దూరం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపైనా దానివెనుక ఉన్న ఓ ఛానల్ పైనా అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి నన్ను తరిమేసే పరిస్థితి ఏనాటికి రాదన్నారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. ఒకవేళ వచ్చినా.. తుది శ్వాస వరకు జగనన్న కోసమే పని చేస్తానని చెప్పారు.

పేరుపొందిన గొర్రెలతో కలిసి గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండడం మంచిది అనే సామెతను బాగా నమ్ముతున్నానన్నారు. మోకాలి సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజులు పాటు నగరానికి దూరంగా ఉండబోతున్నానని మీడియా దానిని వక్రీకరించిందని చెప్పారు అనిల్. జగన్ కు దూరం అవుతున్నాడు.. అనిల్ పని అయిపోయింది. అందుకే కనిపించడం లేదు. అంటూ తప్పుడు వార్తలు పెట్టకండి అని విజ్ఞప్తి చేశారు. ఎవరో కొంతమంది ఫేక్ గాళ్ళు, ఫేక్ వార్తలతో అసత్య ప్రచారాలకు దిగినంత మాత్రాన ఒరిగేదేమీలేదన్నారు. నా పేరును వాడుకొని మీరు డబ్బులు సంపాదించుకుంటూ.. సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తాను అని అన్నారు.

15 రోజుల చికిత్స పూర్తయిన అనంతరం తన చికిత్సకు సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించేందుకు కూడా నేను సిద్ధమే అన్నారు. అన్ని విషయాల్లో కోపం, ఆవేశం ప్రదర్శించినా, ఒక్క సీఎం వైఎస్‌ జగన్ విషయంలో మాత్రం ఓపికగా ఉంటానన్నారు. ఆయన ఏమన్నా.. నేను మాత్రం ఫాలోవర్‌గానే ఉంటానని ప్రకటించారు.

Next Story