అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా గుర్తింపు పొందిన సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి, ఉన్నతాధికారులు భేటీ కానున్నాయి. క్రమబద్ధీకరణ తర్వాత మిగిలిపోయే 40 వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశంపై తుది నివేదికను.. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
గతంలో ప్రభుత్వం వెల్లడించిన ఉత్తర్వుల ప్రకారం.. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, బీ కేటగిరీలో ఏడుగురు, సీ - కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువ మంది, మరికొన్ని చోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఉద్యోగులను ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది.