ఆంధ్రప్రదేశ్ స్టేట్ డేటా సెంటర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. సాంకేతిక లోపాల కారణంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డిసి) సర్వర్ డౌన్ కావడంతో మంగళవారం ఉదయం నుండి రాష్ట్రం అంతటా ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సేవలు ప్రభావితమయ్యాయి. ఫలితంగా, ఉద్యోగుల హాజరు యాప్‌లో భాగమైన ఫేస్ రికగ్నిషన్ పరికరాలు.. రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, అన్ని ఇతర కీలకమైన పరిపాలనా కార్యాలయాల్లో పనికిరాకుండా పోయాయి. ఎస్‌డీసీ సర్వర్ సమస్యల కారణంగా అనేక ఇతర వెబ్ ఆధారిత సేవలు కూడా అంతరాయాలను ఎదుర్కొన్నాయి.
ఊహించని సాంకేతిక సమస్య రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యాలయాల్లో రోజువారీ పనిని నిలిపివేసింది. ప్రజలకు అందించే వివిధ డిజిటల్, ఆన్‌లైన్ సేవలు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయాయి. సర్వర్ డౌన్ ఎందుకు అయ్యిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి, సేవలను పునరుద్ధరించడానికి సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా డిజిటల్ వ్యవస్థపై ఆధారపడి ఉద్యోగులు పని చేస్తున్నందన వీలైనంత తొందరగా ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టెక్ నిపుణులు చర్యలు చేపట్టారు. డేటా సెంటర్ సర్వర్ డౌన్ కావడానికి గల కారణాలపై అధికార వర్గాల నుంచి ఎటువంటి వివరాలు వెలువడలేదు.