అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో 'స్లాట్ బుకింగ్' సేవలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త విధానాన్ని నెలాఖరు నుంచి దశల వారీగా అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వ్యాపారులు, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు సులభంగా పనులు జరిగేలా విధానాలు తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త సంస్కరణల వల్ల సేవలు పారదర్శకంగా జరుగుతాయన్నారు.
ఇకపై రోజుల తరబడి వేచి చూసే ఛాన్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి అనగాని తెలిపారు. స్లాట్ బుకింగ్‌తో మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నామని తెలిపారు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. డెవలప్‌మెంట్ కోసం నాలా చట్టాన్ని కూడా తీసేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు మంత్రి అనగాని తెలిపారు. తొలి విడతలో 26 జిల్లాల్లోని ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. మిగతా కార్యాలయాల్లో దశలవారీగా అమలు చేయనున్నారు.