Andhrapradesh: ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ
మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదెండ్ల తెలిపారు.
By - అంజి |
Andhrapradesh: ఈ 12 జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ
అమరావతి: మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి నాదెండ్ల తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో నేటి నుంచే రేషన్ పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లోని రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు.
12 జిల్లాల్లో 14,145 రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. 7లక్షలమంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో జనరేటర్స్ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అలాగే ఈ 12 జిల్లాల్లో రాబోయే 3 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
ధాన్యాన్ని కప్పేందుకు 30,000 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, వీటిని వినియోగించుకోవాలని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. నిన్న మొంథా తుపాను ముప్పు పై ఏలూరు జిల్లా అధికారులు, ప్రజాపతినిధులతో కలెక్టరేట్ నందు సమావేశం నిర్వహించి, ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండి, తుఫాన్ ప్రభావం తక్కువగా ఉండేలా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మరియు నిత్యావసరాలు, తాగునీటి సరఫరా, రవాణా సేవలకు అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించినట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు.