అమరావతి: నోటీసులతో సంబంధం లేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులు అందుకున్న 1.35 లక్షల మందిలో 95 శాతం మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అనర్హులపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్తగా 7,872 మందికి రూ.4 వేలు చొప్పున వితంతువు పింఛన్ మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.
అటు ఇవాళ ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2,746 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. సీఎం చంద్రబాబు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కె.బోయినపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తాళ్లపాక గ్రామంలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.