అమరావతి: 16 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్‌సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 11 డీఎస్‌సీల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 9 డీఎస్‌సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించామన్నారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెట్టామని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలుత టెట్ నిర్వహించామన్నారు.
వచ్చే ఏడాదిలోగా టీచర్ పోస్టులన్నింటీని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అటు రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తొలుత 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల చేస్తామని షెడ్యూల్ చేశారు. అయితే పలు కారణాల వల్ల నోటిఫికేషన్ విడుదల చేయలేదు.