అమరావతి: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ 6న నోటిఫికేషషన్ విడుదల కావాల్సి ఉండగా.. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో ఏపీ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు వంటి అంశాలపై అధ్యయనం చేసి 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీన్ని బట్టి ఫిబ్రవరి లేదా మార్చిలో నోటిఫికేషన్ విడుదలకానుంది.
ఇటీవల అసెంబ్లీలో మంత్రి లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా వచ్చే విద్యా సంవత్సరంలోగా టీచర్ ఉద్యోగాల భర్తీ పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. మంత్రి మాటలను బట్టి ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చాకే నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈలోగా అభ్యర్థులు ఎగ్జామ్‌కు సిద్ధంగా ఉండాలని సూచించింది. డీఎస్సీ ప్రిపేర్ అయ్యేందుకు అందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో గత నోటిఫికేషన్ రద్దు చేసి, టెట్‌ను నిర్వహించింది. నోటిఫికేషన్ విడుదల చేయాలనుకునే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో న్యాయ సమస్యలు వస్తాయని వాయిదా వేసింది. డీఎస్సీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. నోటిఫికేషన్ వచ్చేలోగా వీరి కోచింగ్ పూర్తి కానుంది.