AndhraPradesh: త్వరలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం.. ఆశగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్‌లను తక్కువ ధరలకు అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 10 Jun 2024 1:02 AM GMTAndhraPradesh: త్వరలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం.. ఆశగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు
విజయవాడ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం పాలసీని సమీక్షించి, మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్‌లను తక్కువ ధరలకు అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్యం ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మద్యం ప్రియులు రోడ్లపై మద్యం సేవించి ఆనందంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారాయి.
రాష్ట్ర మద్యం పాలసీని తక్షణమే తమకు మేలు చేసే విధంగా మార్చాలని చంద్రబాబు నాయుడుని మద్యం ప్రియులు కోరుతున్నారు. నివేదికల ప్రకారం.. టీడీపీ ప్రభుత్వానికి ఐదేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా రూ.75,284 కోట్ల ఆదాయం వచ్చింది. వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వ హయాంలో ఇది రూ.1,24,312 కోట్లకు భారీగా పెరిగింది. దీంతో ప్రభుత్వానికి మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది (2018-19) మద్యం ఆదాయం రూ.20,128 కోట్లు. వైఎస్సార్‌సీ ప్రభుత్వ హయాంలో ఇది క్రమంగా రూ.30,078 కోట్లకు పెరిగింది.
ముఖ్యంగా, 2024 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు.. జగన్ మోహన్ రెడ్డి "చౌకగా" నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని పేర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ధర తగ్గిస్తామని, నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రజాగళం పేరుతో విడుదల చేసిన టీడీపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల మ్యానిఫెస్టో 2024లో మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్‌ల రద్దును కూడా నాయుడు పొందుపరిచారు.
అంచనాల ప్రకారం.. దాదాపు ఆరు నుంచి పది లక్షల మంది మద్యానికి అలవాటు పడ్డారు. మద్యం ధరలు భారీగా పెరగడం, పలు బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంపై జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో వారు టీడీపీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు వారు మద్యం పాలసీపై చర్య కోసం వేచి ఉన్నారు. గతంలో ఒక పెగ్గు రూ.60కి లభించేదని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.180 నుంచి రూ.200కి పెరిగిందని మద్యం వినియోగదారు జి.జగదీష్ అన్నారు. "మేము కొన్ని బ్రాండ్‌లకు అలవాటు పడ్డాము, అయితే అవి గత ఐదేళ్లలో APలోని దుకాణాల నుండి అదృశ్యమయ్యాయి" అన్నారు.