నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్
By అంజి Published on 14 March 2023 3:53 AM GMTనేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అబ్దుల్ నజీర్ పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసన సభ, మండలి వాయిదా పడనుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ , సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై చర్చించనున్నారు.
ఈ నెల 14వ తేదీ అంటే నేటి నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. కనీసం 7 లేదా 8 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం బీఏసీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
ఈ నెల 17న కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి రాష్ట్ర బడ్జెట్ రూ.2.60 లక్షలు కోట్లు అని అంచనా. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 వరకు జరిగే అవకాశం ఉంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మరోవైపు నాలుగేళ్ల పాలనతోపాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక అంశాలపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.