అమెరికాలో ఆంధ్ర విద్యార్థి మృతి.. లేక్‌లో ఫొటోలు తీసుకుంటుండగా..
అమెరికాలోని జార్జ్ లేక్‌లో ఫొటోలు తీస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు.
By అంజి Published on 29 Aug 2024 5:19 AM GMTఅమెరికాలో ఆంధ్ర విద్యార్థి మృతి.. లేక్‌లో ఫొటోలు తీసుకుంటుండగా..
శ్రీకాకుళం: అమెరికాలోని జార్జ్ లేక్‌లో ఫొటోలు తీస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల విద్యార్థి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. అతడిని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంకు చెందిన రూపక్ రెడ్డి పదినిగా గుర్తించారు. అతను పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నాడు. ఎనిమిది నెలల క్రితం అమెరికా వెళ్లాడు. రూపక్, అతని స్నేహితులు బోటింగ్ కోసం జార్జ్ సరస్సును సందర్శించినప్పుడు హేగ్‌లోని లాంబ్ శాంటీ బే వద్ద ఈ సంఘటన జరిగింది.
వారెన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం.. రూపక్ ఆగస్టు 27న మధ్యాహ్నం 3.20 గంటలకు హేగ్‌లోని లాంబ్ శాంటీ బే ప్రాంతంలో స్నేహితుల బృందంతో కలిసి ఉన్నాడు. బృందం ఒడ్డుకు సమీపంలో ఒక పాంటూన్ పడవను కట్టివేసి, నీటిలోని రాయి నిలబడి ఫొటోలు తీసుకుంటుండగా.. అతడితో పాటు స్నేహితుడు రాజీవ్ సరస్సులోకి జారిపడ్డారు. సోనార్‌ని ఉపయోగించి.. హేగ్, నార్త్ క్వీన్స్‌బరీ వాలంటీర్ అగ్నిమాపక విభాగాలకు చెందిన డైవర్లు 25 అడుగుల నీటిలో ఒడ్డు నుండి 100 అడుగుల దూరంలో నిమిషాల వ్యవధిలో రూపక్‌ను కనుగొన్నారు. అయినప్పటికీ, అతన్ని రక్షించలేకపోయారు.
జూలై 7వ తేదీన అమెరికాలో తూర్పు గోదావరికి చెందిన విద్యార్థి సాయి సూర్య అవినాష్ ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మరణించిన సంఘటన జూలైలో జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చిటల్యకు చెందిన అవినాష్ న్యూయార్క్‌లోని అల్బానీలోని బార్బర్‌విల్లే జలపాతంలో గల్లంతయ్యాడు. 18 నెలల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ కోర్సు పూర్తి చేసే దశలో ఉన్నాడు.