అమరావతి: నేడు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024 - 25 ఫైనాన్షియల్ ఇయర్‌కు సుమారు రూ.2.90 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించే ఆస్కారం ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సభ ముందు ఉంచనున్నారు. అటు శాసనమండలిలో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణలు బడ్జెట్లను ప్రవేశపెడతారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌ను రెండుసార్లు ఆమోదింపజేసుకొని నిధులు ఖర్చు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను ప్రాతిపదికగా తీసుకుని సీఎం చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా తొలి అడుగులు వేస్తోంది. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌లో వివిధ అంశాల వారీగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. రాజధాని పనులకు భారీ కేటాయింపు ఉండనున్నాయి. అటు రాజధానికి అవసరమైన ఆర్థిక సాయానికి ఇప్పటికే పర్మిషన్లు వచ్చాయి. పోలవరం సహా సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగానికి కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని సమాచారం. సంక్షేమపథకాలకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.