ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ప్రయత్నాలు: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌పై రాయి విసిరిన సంఘటన సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జగన్ ప్రయత్నాలు: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్‌పై రాయి విసిరిన సంఘటన సంచలనంగా మారింది. ఆయన నుదుటిపై గాయం కావడంతో వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబే చేయించారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మంత్రులు, ఇతర నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సంఘటనపై తాజాగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీ నాయకులకు ముందే అర్థమైపోయిందని అచ్చెన్నాయుడు అన్నారు. అందుకే.. సీఎం జగన్ కొత్త నాటకానికి తెరతీశారని ఆయన చెప్పారు. విజయవాడ ఘటన కూడా ప్రణాళక ప్రకారం జరిగిందే అని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య, కోడికతక్తి తరహాలోనే.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు సీఎం జగన్ ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అయితే.. విజయవాడలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలనీ.. ఈమేరకు ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని అచ్చెన్నాయుడు అన్నారు.