2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. పాఠశాలల ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచి ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని 10 గంటలు చేశారు. ఇక పెంచిన ఈ 3 గంటల సమయాన్ని పాఠ్యాంశాల బోధన, విరామం, ఇతర కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ విద్యాసంవ‌త్స‌రంలో మొత్తం 188 ప‌ని దినాలు ఉండ‌నున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ చివ‌రి క్లాస్ జ‌ర‌నుంది. అనంత‌రం వేస‌వి సెల‌వులు ఉండ‌నున్నాయి.

ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్‌ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేలా పాఠ్య ప్రణాళికను సిద్ధంచేశారు. గతంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు ఉండేవి. గతేడాది కరోనా కారణంగా ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చారు. తాజా ఈ సమయాన్ని సహ పాఠ్య కార్యక్రమాల కోసం పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది.

డిసెంబ‌ర్ 27 నుంచి జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు 6 నుంచి 10 తరగతులకు సమ్మెటివ్‌-1, ఏప్రిల్ 18 నుంచి 29 వ‌ర‌కు 6 నుంచి 9 త‌ర‌గ‌తుల‌కు స‌మ్మెటివ్-2 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబరు, నవంబరు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారం 'నో బ్యాగ్‌ డే', నీళ్లు తాగేందుకు నీటి గంట ఇందుకోసం 5 నిమిషాల విరామం కేటాయించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు ప్రతి రోజు 'చదవడం మాకిష్టం' కార్యక్రమం నిర్వహణకు ఒక పీరియడ్ కేటాయించారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతి శుక్రవారం 8వ పీరియడ్‌లో 'కెరీర్‌ గైడెన్స్‌'పై అవగాహన కల్పించనున్నారు. వారంలో ఒక రోజు పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, ప్రముఖ దినోత్సవాలు, సామూహిక పఠనం కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ తో తెలిపింది.

పండగ సెలవులు ఇవే..

- అక్టోబర్ 11 నుంచి 16 వరకు దసరా సెలవులు,

- నవంబర్ 4న దీపావ‌ళి,

- క్రిస్మస్(మిషనరీ బడులకు) డిసెంబర్ 23-30 వరకు

- జనవరి 10-15 వరకు సంక్రాంతి సెలవులు,

- ఉగాది ఏప్రిల్ 2న సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story