Andhra Pradesh: నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
By Srikanth Gundamalla
Andhra Pradesh: నేడు ఈ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో గోదావరి నది ప్రవాహం ప్రమాదకరంగా మారింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు వరదలో నీట మునిగాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని స్థానిక కలెక్టర్లు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని నాలుగు మండలాల్లోనూ ఉన్నతాధికారులు విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవు ప్రకటించారు. అలాగే కోనసీమ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు ప్రకటించారు.
గోదావరి నదిలో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద వరద పోటెత్తుతోంది. భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో, దిగువకు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరుస అల్పపీడనాలు, వాయుగుండం ఏర్పడడంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో, నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరింది. దాంతో.. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.