Andhra Pradesh: ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
By Srikanth Gundamalla Published on 9 Sep 2024 1:42 AM GMTబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మూడు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. అప్రమత్తం అయిన అధికారులు ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు ఆయా జిల్లాల అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్నచోట సెలవు ప్రకటించారు. ఇంకా బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులూ కలిసి ఈ సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పాటించానలి ఆదేశాలు జారీ చేశారు. ఒక వేళ ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఈ ఆదేశాలను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. యథావిధిగా స్కూళ్లు తెరుస్తున్నారు. మరికొన్ని చోట్ల విద్యార్థులకు మాత్రమే సెలవు ఇస్తూ, టీచర్లను స్కూళ్లకు రమ్మంటున్నారు. ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు హెచ్చరించారు.