ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఏర్పాట్లపై సీఎస్ స‌మీక్ష‌

Andhra Pradesh prepares for intermediate exams. ఈ నెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు

By Medi Samrat  Published on  11 March 2023 12:01 PM GMT
ఈ నెల 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. ఏర్పాట్లపై సీఎస్ స‌మీక్ష‌

అమరావతి:11 మార్చి: ఈ నెల 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను ఆదేశించారు. ఈపరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు,ఎస్పిలు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా అన్ని పరీక్షా కేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచడం తోపాటు తగిన పస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. 20-25 పరీక్షా కేంద్రాలకు కలిపి ఒక 108 అంబులెన్సు సేవలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా ఆయా రూట్లలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకునేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నాపత్రాలు లీకేజి లేదా మాల్ ప్రాక్టీస్ వంటి వదంతులు సృష్టించి విద్యార్థులను ఆందోళనలకు గురిచేసే ప్రయత్నాలు జరుగు తుంటాయని అలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు.జిల్లా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్లు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.

ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షలు జరిగే తేదీల్లో జిరాక్సు కేంద్రాలు/పొటో కాపీయింగ్ కేంద్రాలను మూసి ఉంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఎస్పీలను ఆదేశించారు. అంతేగాక తగినన్ని మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

పరీక్షలు జరిగే సమయంలో..

ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎస్ డా.జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఒక నోడలు అధికారిని నియమించి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో సమన్వయం కలిగి ఉండేలా చూడాలన్నారు.


Next Story