పవన్ కల్యాణే డిప్యూటీ సీఎం.. కీలక శాఖలు కూడా అప్పగింత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు.. పలు కీలక శాఖలు అప్పగించారు.
By Srikanth Gundamalla
పవన్ కల్యాణే డిప్యూటీ సీఎం.. కీలక శాఖలు కూడా అప్పగింత
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో మెజార్టీ సీట్లను సొంతం చేసుకుంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణస్వీకారం చేసి.. శుక్రవారం సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. మంత్రులు కూడా చంద్రబాబుతో పాటే ప్రమాణస్వీకారం చేసినా.. శాఖల కేటాయింపునకు మాత్రం రెండ్రోజుల సమయం తీసుకున్నారు. ముఖ్యమంగా తెలుగు రాష్ట్ర ప్రజలంతా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్‌కు ఏ శాఖను కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగింది. మరోవైపు ఆయనకు డిప్యూటీ సీఎం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మెగాస్టార్ చిరంజీవి ముందుగానే హింట్ ఇచ్చారు. శాఖల కేటాయింపు మాత్రమే తెలియాల్సి ఉండగా.. తాజాగా వాటిని కూడా కేటాయించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పదవితో పాటు.. పలు కీలక శాఖలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కల్యాణ్‌కు కేటాయించారు. అయితే.. ఈ శాఖల కేటాయింపునకు ముందు పవన్ కల్యాణ్‌కు హోంశాఖ ఇస్తారని అంతా అనుకున్నారు. అభిమానులు కూడా ఇదే ప్రచారం చేసుకున్నారు. కానీ.. పవన్ కల్యాణ్‌కు ఉన్న ఇంట్రెస్ట్ కారణంగానే.. ఆయా శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది. అధికారికంగా విడుదల చేసిన జాబితాలో పంజాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖలు పవన్‌కు ఇవ్వడంతో అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.