చంద్రబాబు దౌర్జన్యం నశించాలి: మంత్రి రోజా
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి.
By Srikanth Gundamalla
చంద్రబాబు దౌర్జన్యం నశించాలి: మంత్రి రోజా
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. ప్రతిపక్ష, అధికారపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్నారు. శనివారం ఈ బస్సు యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సీఎం జగన్‌పై రాయి విసరడంతో ఆయన కంటికి పైన గాయం అయ్యింది. సీఎం జగన్‌పై రాయితో దాడి చేయడంతో ఈ ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు.
నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి ఆర్కే రోజా కూడా నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌పై దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారనీ.. ఇవన్నీ అంతం కావాలని మంత్రి రోజా అన్నారు. సీఎం జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఆదరణ లభిస్తోందనీ.. అలాగే ప్రజలు కూడా సీఎం జగన్‌కు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నారని రోజా చెప్పారు. ఇదంతా చూసిన చంద్రబాబు తట్టుకోలేకే ఈ సంఘటనకు పాల్పడ్డారని మంత్రి రోజా ఆరోపించారు.
సీఎం జగన్ ఉంటే తమకు డిపాజిట్లు కూడా రావని చంద్రబాబుకు తెలుసని మంత్రి రోజా అన్నారు. అందుకే సీఎం జగన్‌పై దాడికి ప్రయత్నించారని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నం చేయించారని అన్నారు. ఈ దాడి సంఘటనను ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా తీసుకోవాలని మంత్రి రోజా కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేయాలన్నారు. చంద్రబాబు ఎవరెవరితో ఈ తప్పు చేయించారో అందరిపైనా కేసులు నమోదు చేయాలని రోజా డిమాండ్ చేశారు. అలాగే నిందితులందరినీ అరెస్ట్ చేయాలన్నారు. ప్రజలకు ఏం చేశామో.. లేదంటే ఏ చేస్తామో చెప్పి ప్రభుత్వంలోకి రావాలి తప్ప.. ఇలా దాడులు చేసి రాకూడదని రోజా అన్నారు. ఒక వైపు దాడులు చేయిస్తూనే.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ తమతమ ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్నారని మంత్రి రోజా ఫైర్ అయ్యారు.