చర్చకు వస్తారా.. చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 9:36 AM GMT
andhra pradesh, minister merugu nagarjuna, challenge,  chandrababu,

చర్చకు వస్తారా.. చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల కోసం శంఖారావం పూరించాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార పార్టీ తప్పిదాలను ప్రతిపక్ష పార్టీలు ఎత్తిచూపుతుంటే.. దానికి ధీటుగానే వైసీపీ సమాధానం ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అయితే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున. తాము సిద్ధంగా ఉన్నట్లు.. చంద్రబాబు సిద్ధమైతే రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చర్చ కోసం రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వీరిలో ఎవరైనా చర్చకు రావొచ్చని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజల ఆదరణ లేదంటూ మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు చేశారు. సైకిల్‌ను జనం తొక్కేశారనీ.. మడతపెట్టి పక్కన పడేశారంటూ కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మరోసారి రిపీట్‌ అవుతాయని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ.. అధికారంలో ఉండగా వారికి అన్యాయం చేశారంటూ ఆరోపణలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కళ్యాణమస్తు, షాదీతోఫా కింద రూ.78.53 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారని చెప్పారు. పెళ్లి కానుక కింద చంద్రబాబు 70 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారంటూ విమర్శలు చేశారు. అయితే.. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తాన్ని కూడా ఇచ్చారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నిబద్ధత గల నాయకుడు అనీ.. ఆయన్ని నమ్మితే అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఇక వైసీపీ నుంచి ఎవరైనా సరే పక్క పార్టీలకు వెళ్లినా తిరిగి మళ్లీ రావడం ఖాయమని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు.

Next Story