ఉన్నత వైద్య విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి ఆశలు ఆవిరయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ (22) నగరంలోని ఓ కాలేజీలో ఫిజియోథెరపీ డిగ్రీ పూర్తి చేశారు. ఎంఎస్ చేయడానికి ఈ సంవత్సరం ఆగస్టులో అమెరికాలోని షికాగోకు వెళ్లారు. అయితే ఆమె బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో కారు డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్ స్పృహ తప్పారు. ఇది గమనించిన కొందరు హుటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు.
ఈ విషయాన్ని అక్కడి జహీరా నాజ్ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జహీరా నాజ్ మృతితో విజయవాడలోని ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హయ్యర్ స్టడీస్ చదవడానికి అమెరికా వెళ్లిన తమ కూతురు ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్తుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జహీరా నాజ్ డెడ్‌బాడీని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విద్యార్థిని మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.