ఏప్రిల్ రెండో వారంలోనే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు?

ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  4 April 2024 5:04 AM GMT
andhra pradesh, inter, exam results, elections,

 ఏప్రిల్ రెండో వారంలోనే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు?

ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇంటర్‌ రిజల్ట్స్‌పై విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఒక వైపు రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థులు ఫలితాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల కంటే ముందుగానే ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ రెండో వారంలోనే ఫలితాలను ఇంటర్‌బోర్డు విడుదల చేయనున్నట్లు సమాచారం. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తయ్యిందని తెలుస్తోంది. దాంతో.. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీల మధ్య ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చే చాన్స్‌ ఉంది.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్‌ అమల్లో ఉంది. దాంతో.. విధానపరమైన నిర్ణయాలను అన్నీ ఈసీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈసీ ఆమోదంతోనే ఫలితాల విడుదల తేదీని అధికారులు ఖరారు చేస్తారు. కాగా.. గతంలో మాదిరి ఇంటర్‌ ఫలితాల విడుదల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదు. బోర్డు ఉన్నతాధికారులే ఇంటర్‌ ఫలితాలను విడుదల చేస్తారు. కాగా.. ఈ ఏడాది ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే అధికారులు మూల్యాంకనం మొదలుపెట్టారు.

ఇంటర్‌ పరీక్షలకు ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌కు కలిపి 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక వీరి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 23వేల మంది అధ్యాపకులను ఇంటర్‌ బోర్డు నియమించింది. బుధవారంతో ఇంటర్ స్పాట్‌ వాల్యూయేషన్ ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఫలితాలను కంప్యూటర్లలో డేటా ఎంట్రీ చేసి ఆ తర్వాత విడుదల చేసేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక టెన్త్‌ పరీక్షలు 6,30,633 మంది విద్యార్థులు రాశారు. ప్రస్తుతం టెన్త్ స్పాట్‌ వాల్యుయేషన్‌ కొనసాగుతోంది. ఇందుకోసం 25వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

Next Story