ఏపీలో కోడి పందేలు జరగవా.?
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 14 Jan 2024 7:38 PM IST
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఇది మూగ జీవాలపై క్రూరత్వమేనని, ఈ పందేలు భారీస్థాయిలో జూదానికి అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. వీటిని నిలువరించేందుకు హైకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లను ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.
సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు నిర్వహణ, ఆ సమయంలో జరిగే జూదాన్ని అడ్డుకోవాలని కోరుతూ కృష్ణా జిల్లా కలిదిండికి చెందిన హనుమ అయ్యప్ప హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కేవీ ఆదిత్య చౌదరి.. కోడిపందేల నిర్వహణ జంతు హింస నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరింది. కోడిపందేలు జరగకుండా చూడాలని.. జంతుహింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టం-1974ను కఠినంగా అమలుచేయాలని అధికారులకు ధర్మాసనం సూచించింది.