ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారి అకౌంట్లలోకి డబ్బులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 3 Sept 2024 12:45 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. . గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో ఆయాలు, వాచ్‌మెన్‌లకు జీతాలను పెండింగ్ పెట్టారని.. టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్‌కు కూడా నిధులివ్వలేదని.. ఇటీవల పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్ జీతాల బకాయిలు విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ మేరకు నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు స్కూళ్లలో ఉన్న ఆయాలు, వాచ్‌మెన్ల జీతాల కోసం రూ.64.38 కోట్లు విడుదల చేశారు. అలాగే టాయిలెట్ల కీనింగ్ మెటీరియల్ బకాయిలను కూడా విడుదల చేశారు. ఇవి రూ.25.52 కోట్లు కాగా.. మొత్తం కలిపి రూ.89.9 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. జీతాలు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిల చెల్లింపుపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ జీవో కాపీని కూడా జత చేశారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. నాడు-నేడు పేరుతో గత ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వేలకోట్లను దిగమింగిందంటూ ఆరోపించారు. ఆయాలు, వాచ్‌మెన్లకు కూడా జీతాలు ఇవ్వకుండా బకాయిలు పెట్టడం ఏంటని మండిపడ్డారు. చివరకు టాయ్‌లెట్ క్లీనింగ్ మెటీరియల్ కు కూడా నిధులు ఇవ్వకవడం దారుణమని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
నాడు-నేడు పేరుతో రంగులు వేసి వేలకోట్లు దిగమింగిన వైసిపి పాలకులు పాఠశాలల్లో ఆయాలు, వాచ్ మెన్లకు జీతాలు బకాయి పెట్టి వెళ్లిపోయారు. టాయ్ లెట్ క్లీనింగ్ మెటీరియల్ కు కూడా నిధులు ఇవ్వలేదు. ఇటీవల పాఠశాల విద్యపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు.… pic.twitter.com/0gzpt8n8Pd
— Lokesh Nara (@naralokesh) September 2, 2024