Andhra Pradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బు జమ
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షన్ దారుల అకౌంట్లలో ఇవాళే డబ్బులు జమ కానున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 Jun 2024 1:12 AM GMTAndhra Pradesh: నేడు వారి అకౌంట్లలోకి డబ్బు జమ
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెన్షన్ దారుల అకౌంట్లలో ఇవాళే డబ్బులు జమ కానున్నాయి. జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. గత మే నెలలో మాదిరిగానే ఈ సారి కూడా ఏపీలో పెన్షన్ దారులకు రెండు విధాలుగా డబ్బులు పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. నగదు బదిలీ విధానం ద్వారా కొందరికి.. ఇక వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, దివ్యాంగులకు ఇంటి వద్దకే తీసుకెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వనున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.30 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. వీరికి పెన్షన్ పంపిణీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభత్వం రూ.1,939.35 కోట్లను విడుదల చేసింది.
జూన్ నెలకు సంబంధించి డీటీబీ విధానం ద్వారా 47,74,733 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని ఇవాళే బ్యాంకు అంకౌట్లలో జమ కానుంది. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు 17,56,105 మందికి ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందిస్తారు అధికారులు. జూన్ 1వ తేదీ నుంచి ఐదో తేదీ వరకు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందివ్వనున్నారు. ఇక గతంలో బ్యాంకుల వద్దకు వెళ్లి పలువురు పెన్షన్ దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ.. ఈ సారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకే వాలంటీర్ల ద్వారా పెన్షన్ డబ్బులు తీసుకెళ్లి పంపిణీ చేసింది. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించింది. వారి ద్వారా పెన్షన్ డబ్బులు పంపిణీ చేయొద్దని చెప్పింది. దాంతో ఏప్రిల్ నెల పెన్షన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది పంపిణీ చేశారు. అప్పుడు ఎండ వేడిమి తట్టుకోలేక పలువురు వృద్ధులు చనిపోయారు. ఆ తర్వాత మే నెలలో బ్యాంకు అకౌంట్లలో పెన్షన్ డబ్బులను జమ చేసింది ప్రభుత్వం. తాజాగా మరోసారి జూన్ నెల పెన్షన్ డబ్బులను కూడా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. కాగా.. రాష్ట్రంలో జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనున్న విషయం తెలిసిందే.