గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, లేఅవుట్ల అనుమతులను మరింత సులభతరం చేసింది.
By అంజి Published on 26 Nov 2024 6:23 AM ISTగుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. భవనాలు, లేఅవుట్ల అనుమతులు సులభతరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, లేఅవుట్ల అనుమతులను మరింత సులభతరం చేసింది. ఐదు అంతస్తుల వరకూ నిర్మాణాలకు లైసెన్స్‌డ్ సర్వేయర్ ద్వారా పర్మిషన్ ఇచ్చే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల 95 శాతం మంది ప్రజలకు పర్మిషన్ల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది. డిసెంబర్ 31 నుంచి భవనాలు, లేఅవుట్ల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.
రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎయిర్‌పోర్ట్, అగ్నిమాపక, మైనింగ్, రైల్వే, జలవనరుల శాఖల నుంచి మున్సిపల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పర్మిషన్ వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన రిపోర్ట్‌ను నిన్న సీఎం చంద్రబాబు సమీక్షించి ఆమోదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు. లే అవుట్లలో 9 మీటర్ల వెడల్పులో రోడ్లు వదిలేలా వెసులుబాటు కల్పించామని తెలిపారు.
500 చదరపుప అడుగులు దాటిన నివాస భవనాలకూ సెల్లార్ పార్కింగ్ పర్మిషన్ ఇవ్వాలన్న ప్రతిపాదనలను సీఎం ఆమోదించారని తెలిపారు. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల సెట్ బ్యాక్ పరిమితిని 20 మీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు అదే ప్రాంతంలో అదనపు అందస్తులు నిర్మించుకోవడానికి ఇకపై టీడీఆర్ బాండు అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. స్థలం కోల్పోయినట్లు అధికారుల ధ్రువీకరణ ఆధారంగా పర్మిషన్ ఇస్తారు. అయితే వేరే చోట చేపట్టే అదనపు అందస్తుల నిర్మాణానికి టీడీఆర్ బాండ్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది.