అమరావతి: కౌలు రైతులకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులు లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలను పొందవచ్చు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా అందించే ఈ రుణాలకు అర్హతను ఎలా నిర్ణయిస్తారు? ఎవరికి ప్రాధాన్యం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అర్హతలు
కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్న వారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
ఎవరికి రాదంటే?
ప్రభుత్వం భూమి లేని పేదలకు వ్యవసాయం కోసం ఇచ్చే దారకస్తు భూమి (DKT), అసైన్డ్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రం ఉన్నవారు ఈ రుణానికి అనర్హులు. అలాగే సాగు చేసే భూమి ఎరా కంటే తక్కువ ఉండకూడదు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం లేని వారు సభ్యత్వం లేని వారికి రుణం రాదు. సొంత ఇల్లు ఉన్నవారికే రుణాల మంజూరులో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో ఈ నిబంధనలపై పూర్తి క్లారిటీ రానుంది.