ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  24 Sep 2024 12:06 PM GMT
ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్లపై శుభవార్త అందించింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు సేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరపనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈ -పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతుల వివరాలను ధాన్యం కొనుగోళ్లకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానంతో ఇ-పంట , ఈ -కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను జమ చేయాలని చెప్పింది కూటమి ప్రభుత్వం.

ఇందులో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్‌ఫెడ్ సంస్థలు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో నమోదు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300 , గ్రేడ్ ఏ రకానికి రూ.2320 క్వింటాలుకు చెల్లించాలని తెలిపింది. 2024-25 ఖరీఫ్ సీజన్‌కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పింది. ఇందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించింది. ధాన్యం సేకరణతో పాటుగా మిల్లింగ్ ఆపరేషన్లపై పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story